ఆగస్టు 12వ తేదీ నుంచి జియో గిగాఫైబర్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అదే రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించనున్నారు.
టెలికాం రంగంలోకి జియో సునామీలా దూసుకువచ్చిన సంగతి తెలిసిందే. కేవలం డేటాకు మాత్రమే డబ్బులు చెల్లించండి.. కాల్స్‌ను ఉచితంగా పొందండి అంటూ.. హైస్పీడ్ 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను జియో మనకు పరిచయం చేసింది. దీంతో పెద్ద ఎత్తున కస్టమర్లు జియో కనెక్షన్లను తీసుకున్నారు. ఇక దేశంలో రెండో అతి పెద్ద టెలికాం సంస్థగా కూడా జియో ఇటీవలే అవతరించింది. ఎయిర్‌టెల్‌ను అధిగమించి జియో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇకపై బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలోనూ జియో తుఫాన్ సృష్టించబోతోంది.
ఆగస్టు 12వ తేదీ నుంచి జియో గిగాఫైబర్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అదే రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే గత వారం కిందట రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ జియో గిగాఫైబర్ బీటా ట్రయల్స్ విజయవంతమయ్యాయని చెప్పారు. దీంతో జియో గిగాఫైబర్ సేవలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయని తెలుస్తుండగా.. అందుకు ఆ సంస్థ యాన్యువల్ జనరల్ మీటింగే వేదిక కానుందని సమాచారం. ఆ మీటింగ్‌లోనే ముకేష్ అంబానీ జియో గిగాఫైబర్ సేవలపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ఇక జియో గిగాఫైబర్ పేరిట ఒకేసారి మూడు సేవలను కస్టమర్లకు అందివ్వనున్నారని సమాచారం. నెలకు రూ.600 కనీస చార్జితో ఒకేసారి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, డిష్ టీవీ సేవలను అందిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ప్లాన్‌లో కస్టమర్లకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 50 ఎంబీపీఎస్ లభిస్తుంది. నెలకు 100 జీబీ డేటాను ఉచితంగా ఇస్తారు. అలాగే 100 ఎంబీపీఎస్‌తో మరొక ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారని తెలిసింది. ఇక ఇప్పటికే చాలా మంది వినియోగదారులు జియో గిగాఫైబర్ సేవలను ఉపయోగిస్తున్నారు. వారందరికీ జియో ఉచితంగా ఇంటర్నెట్ ను అందిస్తూ జియో గిగాఫైబర్ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో నిజంగానే వచ్చే నెలలో ఈ సేవలు ప్రారంభమైతే అప్పుడు మార్కెట్‌లో ఉన్న ఇతర బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కంపెనీలకు గట్టి పోటీ ఎదురవుతుందని చెప్పవచ్చు..!