దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గవర్నర్ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు మొన్నటి వరకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరించారు.
దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గవర్నర్ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు మొన్నటి వరకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరించారు. ఆ తరువాత ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్‌గా నియామకమైతే.. తెలంగాణకు తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. అయితే అసలు ఏ రాష్ట్రానికైనా సరే గవర్నర్‌ను ఎలా ఎంపిక చేస్తారో.. గవర్నర్ అయ్యేందుకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా..? అవే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రానికైనా గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. అయితే అంతకు ముందు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఫలానా వ్యక్తిని గవర్నర్‌ను చేయాలని రాష్ట్రపతికి సలహా ఇస్తుంది. దీంతో రాష్ట్రపతి ఆ వ్యక్తిని గవర్నర్‌గా నియమిస్తారు. ఇక గవర్నర్ అయ్యేందుకు అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
* ఆర్టికల్ 153 ప్రకారం.. ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలంటే ఏ వ్యక్తి అయినా భారత పౌరుడు అయి ఉండాలి .
* 35 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండాలి.
* ఆదాయం వచ్చే ఎలాంటి వ్యాపారం, కార్యాలయం ఉండరాదు.
* ఎంపీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయి ఉండరాదు.
పైన చెప్పిన అర్హతలు ఉన్న వారినే రాష్ట్రపతి గవర్నర్‌గా నియమిస్తారు. అయితే మన దేశంలో ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించేటప్పుడు ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. గవర్నర్ల నియామకం వివాస్పదమవుతుంటుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా దేశానికి సేవలు చేసిన వారిని గవర్నర్లుగా నియమిస్తే బాగుంటుందని మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతుంటారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం తమ పార్టీలకు చెందిన నేతలనే గవర్నర్లుగా నియమిస్తుండడం, వారు ఆ పార్టీలకే అనుకూలంగా వ్యవహరించేలా ప్రవర్తిస్తుండడంతో ఎప్పుడూ గవర్నర్ల నియామకం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంటుంది. అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా గవర్నర్ వ్యవహరిస్తే అటు పార్టీలకే కాదు, ఇటు ప్రజలకు కూడా అలాంటి గవర్నర్లపై గౌరవం మరింత పెరుగుతుంది..!