ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల జలమయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంపు ప్రాంతాల ప్రజల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందజేస్తున్నారు. మెడిసిన్స్, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అయితే, వరదల వలన సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ముంపు గ్రామాల బాధితులు ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. మరోవైపు వృద్ధులు, వికలాంగులు వరద నీరు ఇంకా క్లియర్ కాకపోవడం నానా అవస్థలు పడుతున్నారు.
ఇదిలాఉండగా, ఓ మహిళకు అనుకోకుండా పురిటినొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తరలించే అంత రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఆమె ప్రసవించింది. అంబులెన్సు వరదలో రాలేని పరిస్థితి.దీంతో పుట్టిన బిడ్డను, తల్లిని ఆస్పత్రికి తరలించేందుకు స్వయంగా ఓ పోలీసు ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. తల్లిబిడ్డను ఎన్డీఆర్ఎఫ్ సహాయక బోటులో తరలించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పోలీసు అధికారి చర్యను పలువురు అభినందిస్తున్నారు.