ఐఫోన్ 12 ఫోన్ల‌కు భారీ డిమాండ్‌.. ఇప్ప‌టికే 20 ల‌క్ష‌ల ఐఫోన్ 12 ఫోన్లు అమ్ముడ‌య్యాయి..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవ‌లే ఐఫోన్ 12 మినీ, 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు నూత‌న ఫోన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ల‌కు వినియోగ‌దారుల నుంచి భారీగా స్పంద‌న ల‌భిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. గ‌తంలో యాపిల్ ఐఫోన్ 6 ఫోన్ల‌ను విడుద‌ల చేసిన‌ప్పుడు ఎంత‌టి డిమాండ్ ఏర్ప‌డిందో స‌రిగ్గా ఇప్పుడు ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల‌కు కూడా వినియోగ‌దారుల నుంచి అంతే స్పంద‌న ల‌భిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ప్ర‌ముఖ యాపిల్ విశ్లేష‌కుడు మింగ్‌-చి కువో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఐఫోన్ 12 ఫోన్ల‌కు గ‌త శుక్ర‌వారం ప్రీ ఆర్డ‌ర్లు ప్రారంభం కాగా కేవ‌లం 24 గంట‌ల్లోనే 20 ల‌క్ష‌ల ఐఫోన్ 12 ఫోన్ల‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేశార‌ని తెలిసింది. గ‌తేడాది విడుద‌లైన ఐఫోన్ 11కు గాను 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 8 ల‌క్ష‌ల యూనిట్లు అమ్ముడు కాగా, దాంతో పోలిస్తే ఐఫోన్ 12 ఏకంగా 12 ల‌క్ష‌ల యూనిట్లు ఎక్కువ‌గా అమ్ముడ‌వడం విశేషం. ఇక చైనాలో కొత్త‌ ఐఫోన్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉన్న‌ట్లు కువో వెల్ల‌డించారు. అక్క‌డ 5జీ నెట్‌వ‌ర్క్ ల‌భిస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌న్నారు.

అయితే ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్లు మాత్ర‌మే బారీ సంఖ్య‌లో అమ్ముడ‌య్యే అవ‌కాశం ఉంద‌ని కువో తెలిపారు. ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్లు అంత‌గా అమ్ముడ‌వ‌క‌పోవ‌చ్చ‌ని అన్నారు. కాగా ఐఫోన్ 12, 12 ప్రొ ఫోన్ల‌కు ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్లు ప్రారంభం కాగా, 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌కు న‌వంబ‌ర్ 6 నుంచి ప్రీ ఆర్డ‌ర్లు ప్రారంభం కానున్నాయి. 2014లో ఐఫోన్ 6, 6 ప్ల‌స్ ఫోన్లను యాపిల్ విడుద‌ల చేయ‌గా అప్ప‌ట్లో ఆ ఫోన్ల‌ను యాపిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి 6 నెల‌ల్లోనే ఏకంగా 135.6 మిలియ‌న్ యూనిట్ల‌ను విక్ర‌యించింది. 2018 నుంచి యాపిల్ తాను విక్ర‌యిస్తున్న ఐఫోన్ల సంఖ్య‌ను వెల్ల‌డించ‌డం లేదు. కేవ‌లం విశ్లేష‌కులే ఆ వివ‌రాలను అంచ‌నా వేసి చెబుతున్నారు. ఇక ఐఫోన్ 6 త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ ఐఫోన్ 12 ఫోన్ల‌కు భారీగా స్పంద‌న ల‌భిస్తుండ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. వాటిల్లో ఉన్న 5జి ఫీచ‌ర్ కార‌ణంగానే ఐఫోన్ 12 ఫోన్ల‌కు డిమాండ్ ఏర్ప‌డింద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version