రోజుకు రోజుకు దేశంలో ట్రిపుల్ తలాక్ కేసులు పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడుతున్న అమాయక మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఆస్తి కోసం ఆశపడి రెండో పెళ్లికి సిద్ధపడ్డ ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్‌లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో చోటుచేసుకుంది.
ధన్‌బాద్ జిల్లా చస్నాలాకు చెందిన అదిఫా ఫాతిమాకు బంగాల్లోని పురూలియా జిల్లాకు చెందిన అయూబ్ ఖాన్‌తో 2016లో వివాహం జరిగింది. అతను బేకరీలో పని చేస్తుండేవాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని బాధితురాలి తండ్రి తెలిపారు. ఇప్పుడు అయూబ్ ఖాన్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడని వివరించారు. ఆస్తికి ఆశపడే ఈ అన్యాయానికి పాల్పడ్డారని వాపోయారు.
తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే, వారు తమకు ఎలాంటి సాయం చేయడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో నిరాశ చెందిన ఫాతిమా.. జిల్లా సీనియర్ ఎస్పీని ఆశ్రయించింది. ఆమె కంప్లైంట్‌ను ఆధారంగా తీసుకున్న ఎస్ఎస్పీ ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేశారు. బాధితురాలి భర్త తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు స్టేషన్‌కు రాలేదని.. గడువు తేదీ ముగిశాక అతడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.