హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నోఆశలు పెట్టుకున్న వీణవంక మండల ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మరో టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డిల సొంత మండలం వీణవంకలోనే టీఆర్ఎస్ పార్టీకి లీడ్ రాలేదు. 7 నుంచి 9 రౌండ్లలో కేవలం ఒకే రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక్యతను ప్రదర్శించి, కాగా 9వ రౌండ్లో బీజేపీ పార్టీకి భారీ లీడ్ లభించింది. 8 వ రౌండ్ లో టీఆర్ఎస్ 162 ఓట్ల స్వల్ప ఆధిక్యత రాగా… 9వ రౌండ్ లో బీజేపీకి 1835 ఓట్ల ఆధిక్యం లభించింది. ఫలితంగా అన్ని రౌండ్లను కలిపి చూస్తే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు 5015 ఓట్ల మెజారిటీ ఉంది.
ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీ వీణవంక మండలంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. దాదాపు 35 వేల ఓట్లు పోలయితే కనీసం 3వేల నుంచి 5 వేల వరకు లీడ్ వస్తుందని భావించింది. అయితే ప్రజలు మాత్రం ఈటెల రాజేందర్ కే ఆధిక్యతను కట్టబెట్టారు. స్వయంగా గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం అయిన హిమ్మత్ నగర్ లోనే ఆయనకు ఆధిక్యం లభించలేదు. ఇక్కడ గెల్లు శ్రీనివాస్ పై ఈటెల రాజేందర్ 190పైగా ఓట్ల లీడ్ను సాధించారు.