పగలంతా పనులతో అలసి సొలసిన శరీరాలు కాసింత కునుకు తీస్తే.. ఒంటికి ఇంటికి సుఖం అనుకుంటున్న తరుణం.. నడుము వాల్చుదామని కలోగంజో తిని పక్కలేసుకుని పడుకుందామనుకుంటున్న పట్టణవాసికి కంటికి కునుకు లేకుండా పోయింది.. పనులతో బేజారైన పాణాలు… పడుకునే అవకాశం లేకుండా కురిసిన కుంభవృష్టికి కంటికి కునుకే లేదాయే.. గంటో గడియో కాదు.. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది.. నగరం నిద్రపోయే వేళ.. కుంభవృష్టి మేలుకుంది.. తన ప్రతాపాన్ని చూపింది.. అటు దంచి, ఇటు దంచి.. మొత్తం నగరమంతా దంచి కొడుతూనే ఉంది.
ఇది ఒక్క నగర జీవికేనా.. ఈ కుంభవృష్టి ప్రతాపం.. లేదు లేదు.. పల్లే. పట్నం అన్న తేడా లేకుండా తన ప్రతాపాన్ని చూపుతున్నాడు వరుణుడు.. పగలు లేదూ.. రాత్రి లేదూ.. తన పని తాను కానిచ్చేస్తున్నాడు.. అయితే పల్లే జీవులు ఏదో విధంగా సర్ధుకుంటున్నారు.. పాపం పట్నం వాసికే వొచ్చింది కట్టం.. ఏం చేసే పరిస్థితి లేకుండా పోయింది.. పులిసిన ఒళ్ళుకు.. అలసిన మనస్సుకు కాస్తంత తెరిపి లేకుండా వరుణుడు కుంభవృష్టి రూపంలో కకావికలం చేస్తున్నాడు..
ఈ ఏటా కురుస్తున్న వర్షాలు ఏనాడు లేవట.. ఇది ఓ అనుభవశాలి అంటున్న మాట.. ఇప్పుడు నగర జీవికి ఈ కుంభవృష్టితో ఏగేదేట్ట.. ముందుకు సాగేదెట్ట అంతు చిక్కడం లేదు.. నగరంలో రాత్రి 11. 30 నుంచి ప్రారంభమైన వాన అర్ధరాత్రి ఒంటిగంట వరకు కురిసింది. దీంతో మెహదీపట్నం, నాంపల్లి,బేగంబజార్, ఖైరతాబాద్, మోండా మార్కెట్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షానికి నగరంలో దాదాపు 100 బస్తీలు ముంపులో చిక్కుకున్నట్టు అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్ట వద్ద వర్షపునీరు రహదారులను ముంచెత్తింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ఏర్పడింది.
అలాగే మెహదీపట్నం, రాజేంద్రనగర్ మార్గంలో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం అర్ధరాత్రి ఏకధాటిగా కురిసిన వర్షపాతం చూస్తే అత్యధికంగా గుడిమల్కాపూర్ ప్రాంతంలో 14.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే గురువారం ఉదయం నుంచి వర్షం జాడ లేకపోవడంతో నగరజీవికి ఉపశమనం కలిగింది.
అంతలోనే నగరం నిద్రపోతున్నవేళ ఒక్కసారిగ కుంభవృష్టిగా వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. తెల్లవార జాము నుంచి మరోమారు వర్షం మొదలైంది.. ఇది ఎప్పుడు ఆగుతుందో.. నగరజీవికి ఎప్పుడు తెరిపినిస్తుందో తెలియని పరిస్థితి ఉంది.. వాతావరణ శాఖేమో.. మూడు రోజులు వానలు దంచి కొడుతాయని చెపుతుంది.. ఎప్పుడు ఎక్కడి నుంచి ఈ వానలతో ఉపద్రవం ముంచుకొస్తుందో అనే ఆందోళన నగర జీవిలో కనిపిస్తుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంకు రుతుపవనాలు జత కలువడంతో ఈ వానలు దంచి కొడుతున్నాయి…