సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఐపీఎల్ 2020 లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్లేయర్లు సమిష్టిగా రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది.
అబుధాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేపట్టింది. అయితే పిచ్ మరీ స్లోగా ఉండడంతో బౌలర్లకు బాగా అనుకూలించింది. ఈ క్రమంలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించేందుకు చాలా కష్టపడ్డారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్ మెన్లలో వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్‌లు రాణించారు. వార్నర్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, బెయిర్ స్టో 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53 పరుగులు చేశాడు. అలాగే విలియమ్సన్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. మరోవైపు ఢిల్లీ బౌలర్లలో రబాడా 2 వికెట్లు తీయగా, మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. మధ్య మధ్యలో ధవన్, పంత్, హిట్‌మైర్‌లు బౌండరీలు సాధించినా పిచ్ అసలు పరుగులు చేసేందుకు ఏమాత్రం యోగ్యంగా లేకపోవడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ధవన్, పంత్, హిట్‌మైర్‌లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ధవన్ 31 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేయగా, పంత్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. అలాగే హిట్‌మైర్ 12 బంతుల్లోనే 2 సిక్సర్లతో 21 పరుగులు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లను వేసి 14 పరుగులు ఇచ్చి అతను 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ పతనం ఖాయమైంది. అలాగే భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, నటరాజన్‌లు చెరొక వికెట్ తీసి హైదరాబాద్ విజయంలో పాలు పంచుకున్నారు.