దుబాయ్‌లో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ తడబడింది. ఆ జట్టు ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో పంజాబ్‌పై హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్‌లు అద్భుతంగా రాణించారు. మొదటి వికెట్ కు వారు ఏకంగా 160 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. జానీ బెయిర్‌స్టో 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులు చేయగా, వార్నర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఇక పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీకి 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ 16.5 ఓవర్లకే 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో నికోలాస్ పూరన్ మినహా ఎవరూ రాణించలేదు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేసిన పూరన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి సహకారం లభించలేదు. ఎప్పటికప్పుడు వికెట్లను పారేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఓటమి పాలైంది. ఇక హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. అలాగే ఖలీల్ అహ్మద్, నటరాజన్‌లు చెరొక 2 వికెట్లను తీశారు. అభిషేక్ శర్మకు 1 వికెట్ దక్కింది.