తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఒడిశా మీదుగా ద్రోణి ఉంది. అలాగే, తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటితో పాటు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా మారొచ్చంటున్నారు నిపుణులు.
వీటన్నింటి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత కొన్ని రోజులుగా ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తునే ఉన్నాయి. తెలంగాణలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.