దుబాయ్‌లో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 40వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్ అలవోకగా ఛేదించింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌ను గెలిపించారు. ఈ క్రమంలో రాయల్స్‌పై హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా రాయల్స్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో సంజు శాంసన్, స్టోక్స్‌లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. శాంసన్ 26 బంతులు ఆడి 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 36 పరుగులు చేయగా, స్టోక్స్ 32 బంతులు ఆడి 2 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3 వికెట్లు తీశాడు. శంకర్, రషీద్ ఖాన్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో మనీష్ పాండే, విజయ్ శంకర్‌లు అర్ధ సెంచరీలు సాధించి అజేయంగా నిలిచారు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో పాండే 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, శంకర్ 51 బంతులు ఆడి 6 ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి.