హైదరాబాద్ మహానగరంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. చెరువు భూములు, ఎప్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఏ మాత్రం వెనుకాడబోమని హైడ్రా కమిషనర్ మరోసారి స్పష్టంచేశారు. అయితే, హైడ్రాకు వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. పలు నిర్మణాలను కూల్చొద్దని కోర్టు స్టే ఇచ్చిన క్రమంలో ఇకపై రెండు దశల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతాయని కమిషనర్ స్పష్టంచేశారు.
అందుకోసం పది మంది అధికారులు, సిబ్బంది పరిశీలన మొదలుపెట్టారు.నాలాలపై వరద నీరు వెళ్ళకుండా అడ్డుపడుతున్న కట్టడాలను ముందుగా కూల్చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.అటువంటి నిర్మాణాలను గుర్తించే పనిలో అధికారులు ప్రస్తుతం నిమగ్నమయ్యారని తెలుస్తోంది. అనంతరం వాటిని రెండు దశల్లో కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు.