హమ్మయ్య.. నేను కూడా ఓటేశాను.. విశ్వ‌విజేత‌న‌య్యాను

-

ఔను.. నేను కూడా ఓటేశాను!!. నా ఓటు ఉంది.. ఎక్క‌డికీ పోలేదు.. ఉంటుందా? లేదా? లేదంటే ఒక వార్డు నుంచి మ‌రో వార్డుకేమైనా మార్చారా? ఒక కుటుంబంలో నాలుగు ఓట్లుంటేనే రెండు ఓట్లు ఒక డివిజ‌న్‌లో, మ‌రో రెండు ఓట్లు మ‌రో డివిజ‌న్‌లో క‌లిపారంటూ ఓట‌ర్లంతా ఒక‌వైపు ఆందోళ‌న చేస్తున్నారు. మ‌రోవైపు ఓటరు స్లిప్ తీసుకొని ఓటువేయ‌డానికి వెళుతున్నా కూడా అప‌న‌మ్మ‌క‌మే. ఉంటుందా? ఉండ‌దా? ఉంటే మంచిది… నా అంత అదృష్ట‌వంతులెవ‌రూ ఉండ‌రు.. ఉండ‌క‌పోతే ఏం చేయాలి? ఎక్క‌డ‌ని వెత‌కాలి? ఎటువైపు వెళ్లాలి? స‌రైన స‌మాధానం చెప్పేవారైనా ఉన్నారా? అనే ప‌లు సందేహాలు.. ప‌లు అనుమానాల మ‌ధ్య పోలింగ్ కేంద్రానికి వెళుతున్నాను.

క‌రోనా ముందు.. క‌రోనా త‌ర్వాత‌..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోసం సంవ‌త్స‌రం క్రితం ఒక నోటిఫికేష‌న్‌, సంవ‌త్స‌రం త‌ర్వాత మ‌రో నోటిఫికేష‌న్ వ‌చ్చింది. క‌రోనా అన్నారు. క‌రోనాకు ముందు ఒక‌లా.. క‌రోనా త‌ర్వాత మ‌రోలా రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి. మారుతూనే ఉన్నాయి. పార్టీల మ‌ధ్య వివాదాలు రేకెత్తుతూనే ఉన్నాయి. అసెంబ్లీకి, లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుంటే నా ఆలోచ‌నా విధానం ఒక‌లా ఉంటుంది. కానీ ఇవి స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌లు. స్థానికంగా ఎన్నో స‌మ‌స్య‌లున్నాయి. కొన్ని సంవ‌త్స‌రాల నుంచి అస‌లు ఎన్నిక‌లే జ‌ర‌ప‌లేదు.. వార్డుల పున‌ర్విభ‌జ‌నపై ఏ పార్టీకి ఆ పార్టీయే కోర్టుకు వెళ్ల‌డం.. స్టే తీసుకురావ‌డం.. ఎన్నిక‌లు ఆప‌డం.. దీంతో మా న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు, మా పుర‌పాల‌క సంఘానికి, మా న‌గ‌ర పంచాయితీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు.

ఎన్నెన్నో ఆలోచ‌న‌లు..

ఇన్నిర‌కాల ఆలోచ‌న‌ల మ‌ధ్యే పోలింగ్ కేంద్రానికి వెళుతున్నాను. దారిలో ఎక్క‌డ చూసినా రోడ్ల‌న్నీ గుంత‌లు ప‌డివున్నాయి. ఆ రోడ్ల‌న్నీ వేసి ఎన్ని సంవ‌త్స‌రాల‌వుతుందో కూడా గుర్తుకు రాలేదు. ఎందుకంటే కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆ గుంత‌ల రోడ్ల‌మీదే న‌డ‌వ‌డంకానీ, బండిపై వెళ్ల‌డంకానీ అల‌వాటైంది. వేస‌వికాలం వ‌చ్చింది. మంచినీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఎన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కోవాలో.. స‌రిగా మంచినీరు స‌ర‌ఫ‌రా కాక‌పోతే నేనుకానీ, నా కుటుంబ ప‌రిస్థితికానీ ఏమిటి? గొంతు త‌డుపుకోవ‌డానికి గుక్కెడునీరు దొరుకుతుంద‌నే ఆశ ఉందికానీ… అన్ని అవ‌స‌రాల‌కు స‌రిప‌డా నీరు దొరుకుతుంద‌న్న న‌మ్మ‌కం క‌ల‌గ‌డంలేదు. ఎందుకంటే మా న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు పాల‌కులెవ‌రూ లేరు.. మా పుర‌పాల‌క సంఘానికి నిధులు విడుద‌ల కాలేదు.. మా న‌గ‌ర పంచాయితీకి రావ‌ల్సిన నిధుల‌ను రాజ‌కీయ కార‌ణాల‌తో ప్ర‌భుత్వ‌మే ఆపింది.

ఓటుకు డ‌బ్బులు అంద‌లేదంట‌..

ఇంకా ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లెన్నో ఉన్నాయి.. ఎవ‌రిని ఎన్నుకోవాలో అర్థంకాని ప‌రిస్థితి. పారిశ్రామిక‌వేత్త‌లు ఎప్పుడైతే రాజ‌కీయాల్లోకి వ‌చ్చారో అప్పుడే ఎన్నిక‌లు కూడా వ్యాపార‌మైపోయాయి. ఓటుకు ఇంత‌.. అని పంచారంటూ పోలింగ్ కేంద్రంవ‌ద్ద చెప్పుకుంటున్నారు. మాకు కొంతే ఇచ్చారంటూ కొంద‌రు.. మాక అస‌లు రాలేదంటూ మ‌రికొంద‌రు.. పంపిణీ చేయ‌డానికి డ‌బ్బులిచ్చినా మ‌ధ్య‌లో వాళ్లు నొక్కేసి రూపాయికి అర్ధ‌రూపాయే పంచార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటున్నారు. అంతేకానీ డ‌బ్బులు తీసుకొని మ‌నం ఓటును అమ్ముకోకూడ‌దు అని ఎవ‌రూ ఆలోచించ‌డంలేదు. నా వ‌ర‌కు డ‌బ్బులు రాలేద‌ని బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌జాస్వామ్యం మ‌న‌కు క‌ల్పించిన విలువైన ఓటుహ‌క్కును మ‌న‌మే అమ్మేసుకునేలా ఈ రాజ‌కీయ‌వేత్త‌లు మార్చేశార‌ని మాత్రం వీరు ఆలోచించ‌డంలేదు. వీరిది అమాయ‌క‌త్వ‌మా? లేక వారికివారే తెలివిగ‌ల‌వార‌నుకుంటున్నారా? అనేది నాకు అర్థం కాలేదు. ఓటు హ‌క్క‌ను ఆయుధంగా మార్చుకొని మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే తీర్చిదిద్దుకోవ‌చ్చ‌ని ఇప్ప‌టికీ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు అర్థంకాలేదేమోన‌నిపించింది.

విశ్వ‌విజేత‌న‌య్యాను..

ఆలోచ‌నల‌ సుడిగుండాల మ‌ధ్య నెమ్మ‌దిగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాను. నా ఓటు ఆ పోలింగ్ కేంద్రంలోనే భ‌ద్రంగా ఉంది. హ‌మ్మ‌య్య‌! అనుకొని నా బాణాన్ని సంధించాను. ప్ర‌పంచాన్ని జ‌యించిన చ‌క్ర‌వ‌ర్తిలా అనిపించింది. ఆ సంతోషంతో నేను నా కార్యాల‌యానికి చేరుకున్నాను. ఓటు వేయ‌డానికి అనుమ‌తిచ్చిన కార్యాల‌య యాజ‌మాన్యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version