ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సుబ్రమణ్య స్వామి దేవాలయాలపై దాడులు.. టీటీడీపై ప్రభుత్వ అజమాయిషీ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదన్న ఆయన ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తానని అన్నారు. ఎయిరిండియా ప్రైవేటీకరణనూ వ్యతిరేకించానన్న ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై నాకు అవగాహన లేదు.. కానీ ప్రతీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తామనే విధానం మంచిది కాదని అన్నారు.
ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా లేదా అనే అంశంపై కేస్ బై కేస్ చూడాల్సి ఉంటుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానిని కలిసేటప్పుడు నేనూ సీఎం జగనుతో వెళ్తానన్న ఆయన తెర వెనుక చంద్రబాబు ఉండి టీటీడీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. వెంకన్న భక్తునిగా ఈ దుష్ప్రచారం విషయంలో చాలా బాధ పడ్డానని చంద్రబాబు సడెనుగా సోనియా కాళ్లపై ఎందుకు పడ్డారో ఇప్పటికీ సమాధానం చెప్పుకోలేదని అన్నారు. చంద్రబాబు విశ్వసనీయత లేని వ్యక్తిన్న ఆయన కొన్ని వారాల గడువులోనే చంద్రబాబు మోడీ శిబిరం నుంచి సోనియా శిబిరంలోకి మారితే ఆశ్చర్యపోయామని అన్నారు.