బుడగ జంగాల వారికి ఎంతో సాయం చేశానని మల్కాజ్ గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజ్‌గిరి, దుర్గాపురం బుడగ జంగాల బస్తీ వాసులతో ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాదిగా ఆదరణకు నోచుకోక, ఎన్ని బాధలున్నా దిగమింగుకుని కుటుంబ బాధ్యతలు చేసుకునే వారు మీ బుడగ జంగాలు. మీ వర్గం వారితో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. కుల సర్టిఫికేట్లకు, రేషన్ కార్డులకు కూడా దిక్కు లేకుండా ఉండేది. అప్పట్లో నేను కొన్ని వర్గాలకు రేషన్ కార్డులకు, కులసర్టిఫికేట్లకు వారికి సహాయం చేశాను.
ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో కొందరికి బ్యాంకుల నుండి రిబేటులో రుణాలు కూడా ఇప్పించాను. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం నాయకులతో నేను మీటింగులు పెట్టాను. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటే. మన పార్లమెంటులో ఒక్క ఓటు కూడా పోకుండా ఈ పది రోజులూ బాగా కృషి చేయాల్సి ఉంటుంది. కరోనా కాలంలో నేను ఎలా పని చేశానో మీకు తెలుసు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశానో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పని చేశానో మీకు తెలుసు. మనం చిన్నప్పుడు హాస్టళ్లలో ఎలాంటి అన్నం తినేవాళ్లమో మీకు తెలుసు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ హాస్టళ్లలో సన్నబియ్యం అన్నం పెట్టించాము.
పేద పిల్లలకు, పల్లెల నుండి వచ్చిన పిల్లలకు ఇక్కడ చదువుకోవడానికి ప్రత్యేక కమ్యూనిటీ హాల్స్ కట్టించాను. మన ప్రాంతంలో సమస్యలను నేరుగా ప్రధాని మోదీకి తెలియజేయగల పరిస్థితిలో ఉన్నాను. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వారు ప్రజలను ఎంతో ప్రలోభపెడతారు. డబ్బు, మద్యం ఆశ చూపిస్తారు. కానీ వాటికి గురి కాకుండా ఒక్క ఓటు కూడా పోకుండా మన కార్యకర్తలు ప్రయత్నించాలి. బీజేపీ పథకాలు ప్రజల్లో ప్రచారం చేసి, బీజేపీకే ఓట్లు పడేలా కృషి చేయాలి.