రెండు రోజుల్లోనే ముగిసిన పింక్ బాల్ టెస్టు మ్యాచ్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్‌.. ఎంత ఇచ్చిందంటే..?

-

అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన పింక్ బాల్ టెస్టు కేవ‌లం 2 రోజుల్లోనే ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్‌ను భార‌త్ ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడించింది. భార‌త స్పిన్న‌ర్ల ధాటికి ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ నిల‌బ‌డ‌లేక‌పోయారు. దీంతో ప‌లువురు విదేశీ మాజీలు ఆ పిచ్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే భార‌త మాజీలు మాత్రం ఆ పిచ్ అలా ఉండ‌డంపై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇక ఆ పిచ్ కు ఐసీసీ రేటింగ్ కూడా ఇచ్చింది. ఆ పిచ్ యావ‌రేజ్ పిచ్ అని ఐసీసీ తెలిపింది. అయితే ఒక టెస్టు, వ‌న్డే లేదా టీ20 జరిగే పిచ్‌పై ప్ర‌తి మ్యాచ్‌కు రిఫరీ రిపోర్ట్‌ను ఐసీసీకి పంపిస్తారు. దీంతో పిచ్‌ను ప‌రిశీలించి ప్ర‌తి మ్యాచ్ అనంత‌రం రేటింగ్ ఇస్తారు. అలాగే పింక్ బాల్ టెస్టు జ‌రిగిన పిచ్‌కు కూడా రేటింగ్ ఇచ్చారు. దాని రేటింగ్ యావ‌రేజ్ అని చెప్పారు.

ఒక పిచ్‌కు యావ‌రేజ్ రేటింగ్ వ‌స్తే ఏమీ కాదు. కానీ దానికి పూర్ లేదా అన్‌ఫిట్ అనే రేటింగ్ వ‌స్తే మాత్రం నిర్వాహ‌కులు ఐసీసీకి స‌మాధానం చెప్పాలి. పిచ్‌ను అంత నాసిర‌కంగా ఎందుకు రూపొందించారో ఐసీసీకి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే పింక్ బాల్ టెస్టు జ‌రిగిన పిచ్‌కు కూడా నాసిర‌కం రేటింగ్ వ‌స్తుంద‌ని భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో పిచ్ క్యురేట‌ర్లు ఊపిరిపీల్చుకున్నారు. అయితే చివ‌రి టెస్టు మ్యాచ్ జ‌రిగిన పిచ్‌కు ఐసీసీ గుడ్ అని రేటింగ్ ఇవ్వ‌గా, భార‌త్, ఇంగ్లండ్‌ల మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన మొద‌టి టీ20కి ఉప‌యోగించిన పిచ్‌కు ఐసీసీ వెరీ గుడ్ అని రేటింగ్ ఇవ్వ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version