ప్రభుత్వ నూతన ఇసుక విధానం పేద వర్గాలు, కార్మిక వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పూర్తితో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ నెల 11వ తేదీ నుంచి పామర్రులో ప్రగతి పథం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈరోజు వర్ల కుమార్ రాజా తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఇసుక దోపిడీకి ఎవరైనా తెరలేపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు .
అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా పారదర్శకంగా ఇసుక విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి గురువారం నియోజకవర్గ కేంద్రమైన పామర్రులో నిర్వహించే ప్రగతి పథం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.