ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమైంది. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కు తగ్గడం లేదు. త్వరలోనే రాజధాని తరలింపు అనేది ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కేబినేట్ సమావేశం తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాజధాని తరలింపు తేదీని ఖరారు చెయ్యాలని భావిస్తుంది.
అయితే తరలింపుని అడ్డుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు, కొన్ని అసాంఘిక శక్తులు, రాజకీయ పార్టీలు కూడా యత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు గత నెల 31న ప్రభుత్వానికి ఓ నివేదికను జగన్ కు అందించాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం జనవరి 15తో ముగియనున్న జాతీయ భద్రతా చట్టం,
1980 అమలును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పేరుతో విడుదలైన ఉత్తర్వుల్లో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని ఆందోళనకర పరిస్థితులు, నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు జాతీయ భద్రతా చట్టం ప్రకారం అసాంఘిక శక్తులను అదుపులోకి తీసుకునే అధికారాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు,
విజయవాడ, విశాఖ పోలీసు కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసారు. ఏ విధమైన గొడవలకు దిగినా, హింసను ప్రోత్సహించినా, ఆ విధంగా వ్యాఖ్యలు చేసినా సరే, కారణం ఏంటీ అనేది చెప్పకుండానే స్థానిక పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు అదుపులోకి తీసుకోవచ్చు. మూడు నెలల పాటు నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంది. జాతీయ భద్రతా చట్టం పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. రాజ్యానికి వ్యతిరేకంగా అసాంఘిక శక్తులు చెలగేరే అవకాశం ఉన్నప్పుడు స్థానిక పోలీసులకు అదుపులోకి తీసుకునే అధికారం ఉంది.