కాల్పుల ఘటనపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్యలు

-

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న ఓ ర్యాలీలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన సంగతి తెలిసిందే. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన లాహోర్ లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇమ్రాన్ కు ప్రాణహాని తప్పడంతో ఆయన పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ ఊపిరి పీల్చుకుంది. ఈ కాల్పుల ఘటనపై ఇమ్రాన్ మాజీ భార్యలు స్పందించారు. మొదటి భార్య జెమీమా గోల్డ్ స్మిత్, రెండో భార్య రెహామ్ ఖాన్ ఈ కాల్పుల ఘటనను ఖండించారు. ఈ కాల్పుల ఘటనలో ఇమ్రాన్ స్వల్పగాయాలతో తప్పించుకోవడం పట్ల జెమీమా గోల్డ్ స్మిత్ సంతోషం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ పై కాల్పులు జరిగాయని తెలియగానే భయపడ్డామని తెలిపారు. ఇమ్రాన్ పై మరిన్ని రౌండ్లు కాల్పులు జరగకుండా దుండగుడ్ని అడ్డుకున్న ఇబ్తెసామ్ అనే వ్యక్తిని ఆమె హీరోగా అభివర్ణించారు. అంతేకాదు, తన కుమారులకు తండ్రిని మిగిల్చిన ఆ వ్యక్తికి రుణపడి ఉంటామని తెలిపారు.

బ్రిటన్ లో సంపన్న కుటుంబానికి చెందిన జెమీమా గోల్డ్ స్మిత్ ను ఇమ్రాన్ ఖాన్ 1995లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. 9 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బ్రిటన్ కే చెందిన టీవీ యాంకర్ రెహామ్ ఖాన్ ను ఇమ్రాన్ వివాహం చేసుకున్నారు. 2015లో ఈ వివాహం జరగ్గా, 10 నెలలకే ఆ బంధం ముగిసింది. తాజా తన మాజీ భర్తపై కాల్పులు జరిగాయని తెలియగానే రెహామ్ ఖాన్ ట్విట్టర్ లో స్పందించారు. పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్, ఇతర నేతలపై కాల్పులు జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని రెహామ్ ఖాన్ పేర్కొన్నారు. రాజకీయ నేతల భద్రతను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version