తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వ్యాధిని ఏ స్తాయిలో కట్టడి చెయ్యాలని చూసినా సరే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ విస్తరించిన సంగతి తెలిసిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా విషయంలో ఇన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భం ఎక్కడా లేదు.
అయినా సరే కరోనా కట్టడి కావడం లేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హోం క్వారంటైన్ గడువుని 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రైమరీ కాంటాక్ట్ లకు మాత్రమే పరిక్షలు చెయ్యాలని సూచనలు చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలుగా ఉన్న నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది.
వరంగల్ ఉమ్మడి జిల్లా, ఖమ్మం ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీనితో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటనలు చెయ్యాలని సిఎం కేసీఆర్ ఆదేశాలు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో కేసులను కట్టడి చేయడానికి మరిన్ని కీలక నిర్ణయాలు అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.