పర్యావరణ విభాగంలో తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు చోటు దక్కింది. పల్లె ప్రకృతి వనాలతో జీవవైవిధ్యం పెరిగిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. సామాజికరంగంలో 75 ఉత్తమ విధానాలను నీతి ఆయోగ్ ప్రకటించింది. పక్షులు, పురుగులు, సీతాకోకచిలుకలు పెరిగాయని నీతి ఆయోగ్ పేర్కొంది. కార్బన్ ఫిక్సేషన్, భూమిలోనూ కార్బన్ నిల్వలు పెరిగాయని నీతి ఆయోగ్ తెలిపింది. భూమి, నీటి పరిరక్షణ చర్యలకు తోడ్పడుతున్నాయని చెప్పింది. ఉత్తమ బయో హార్వెస్టింగ్ నిర్మాణాలు మారాయని తెలిపింది. ప్రస్తుతం ఈ వనాలు గ్రామాల్లో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ముఖ్యమంత్రి పల్లె ప్రకృతి వనాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నది. పట్టణాల్లో పార్కులు ఏర్పాటు చేసి కాలనీ వాసులు సాయంత్రం వేళలో సేద తీరేలా వెసులుబాటు కల్పించారు.
ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు సౌకర్యంగా ఉండేలా నడకదారి ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధుల ఆధారంగా పిల్లలు ఆడుకోవటానికి క్రీడా సామగ్రిని సైతం ఏర్పాటు చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను వన సంరక్షణ సేవలకు అప్పగించారు. ప్రజలు రోజూ సాయంత్రం ప్రకృతి వనాలకు వెళుతూ ఆహ్లాదకర వాతావరణంలో కాసేపు గడుపుతూ మానసిక ఉల్లాసం పొందుతున్నారు. కూర్చోవటానికి బెంచీలు ఏర్పాటు చేశారు. మొక్కలు, ప్రకృతి వనాల వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం పాటుపడుతున్నది. సీఎం కేసీఆర్ పల్లెలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టారు.