మార్చి 25వ తేదీ నుంచి భారత్‌లో అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. ప్రధాని మోదీ ఆత్మ నిర్భర భారత్ పేరిట రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. పరిశ్రమలు కోలుకునేందుకు, ప్రజలు ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు ఆ ప్యాకేజీని అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక ఆర్‌బీఐ కూడా పలు ఉద్దీపనలు ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి దేశంలో లాక్‌డౌన్ లేకపోయినా.. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు మళ్లీ బ్రేకులు పడుతున్నాయి.
దేశంలో అనేక రకాల పరిశ్రమలకు కావల్సిన ముడి సరుకుతోపాటు వారు ఉత్పత్తి చేసే వస్తువులను దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు రవాణా అవసరం. అది అనేక విధాలుగా జరుగుతుంది. అందులో రోడ్డు రవాణా చాలా ముఖ్యమైంది. విమాన, రైలు మార్గాల్లో సాధ్యం కాని రవాణాను రోడ్డు రవాణా ద్వారా భర్తీ చేస్తారు. అయితే ఈ రవాణాపై ఆధార పడ్డ అనేక పరిశ్రమలు ప్రస్తుతం నిత్యం పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఆ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. అవసరం ఉన్న మేరకు ముడిసరుకును కొనుగోలు చేయడంతోపాటు డిమాండ్ మేరకే వస్తువులను ఉత్పత్తి చేసి రవాణా చేస్తున్నాయి. దీంతో సరుకు రవాణా చేసే వారిపై ఈ భారం పడుతోంది. అలాగే పరిశ్రమల్లో వస్తుత్పత్తి పరిమిత సంఖ్యలో జరుగుతోంది. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మందగమనంలో వృద్ధి చెందుతోంది.
కరోనా లాక్‌డౌన్ వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినడంతో అన్‌లాక్ 1.0 నుంచి తిరిగి మళ్లీ అది వృద్ధి చెందుతుందని భావించారు. కానీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఆర్థిక వ్యవస్థ ఒకేసారి వృద్ధి చెందడం కుదరదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంధన ధరల వల్ల పరిశ్రమలు అంతంతమాత్రంగానే కార్యకలాపాలు నిర్వహించేందుకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు చూస్తున్నాయి. ఇది దేశ జీడీపీపై ప్రభావం పడుతుంది. కరోనా వల్ల పతమైన దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం తిరిగి పునరుద్ధరించాలనుకున్నా.. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఆ లక్ష్యం నెరవేరడం లేదు.
కరోనా వల్ల పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఇంధన ధరల పెంపు వల్ల వస్తున్న పన్నులపైనే ఎక్కువగా ఆధార పడ్డాయి. అందువల్లే ఆ ధరలు తగ్గడం లేదు. దీంతో ఇంధన ధరల పెంపు దేశంలో అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ కూడా మంద గమనంలో ముందుకు వెళ్తోంది. అయితే రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గితే అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.