పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ సరిహద్దులో పరిస్థితి తీవ్రతరమైన నేపథ్యంలో, అక్కడి ఆర్మీ కమాండర్లకు కైనెటిక్ యాక్షన్ చేపట్టేందుకు పూర్తి అధికారాలు మంజూరు చేశారు. ఇది భవిష్యత్తులో పాకిస్తాన్ తీసుకునే దుందుడుకు చర్యలకు గట్టి హెచ్చరికగా భావించబడుతోంది. భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)ల మధ్య మే 10న జరిగిన చర్చల్లో కాల్పుల విరమణపై అవగాహన ఒప్పందం కుదిరింది. కానీ, ఒప్పందానికి కొన్ని గంటల ముందే భారత్ స్పష్టం చేసింది — భవిష్యత్తులో ఉగ్రదాడులు జరిగితే, వాటిని యుద్ధ చర్యలుగా పరిగణిస్తామని.
భారత ఆర్మీ ప్రకటన ప్రకారం, మే 10-11 మధ్య జరిగిన కాల్పుల విరమణ, వైమానిక ఉల్లంఘనల నేపథ్యంలో, ఆర్మీ చీఫ్ పశ్చిమ ప్రాంత కమాండర్లతో భద్రతా సమీక్ష నిర్వహించారు. ఆ అనంతరం, పాకిస్తాన్ ఉల్లంఘనలు కొనసాగితే కైనెటిక్ యాక్షన్ తీసుకోవాలంటూ కమాండర్లకు పూర్తి అధికారం ఇవ్వబడింది. “కైనెటిక్ యాక్షన్” అంటే ఆయుధాలతో చర్యలు తీసుకోవడం, శక్తితో స్పందించడమే. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఘటన, ఈ ఉద్రిక్తతలకు బీజం వేసింది. అనంతరం భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు ప్రారంభించింది.
ఇది సరిపోలక, పాక్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించడంతో, శనివారం తెల్లవారుజామున భారత్, పాక్ మిలిటరీ స్థావరాలపై గట్టి ప్రతిదాడులు జరిపింది. ఇందులో పాక్ రాడార్ కేంద్రాలు, ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి.