కరోనా నుంచి బయట పడేందుకు కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనున్న విషయం విదితమే. జూన్ 1 నుంచి అన్‌లాక్ 1.0 ప్రారంభం కాగా జూన్ 30 వరకు దీనికి గడువు విధించారు. ఆ గడువు మరో 2 రోజుల్లో ముగియనుంది. దీంతో మోదీ అన్‌లాక్ 2.0ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మోదీ సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. అందువల్ల జూలై 1 నుంచి అన్‌లాక్ 2.0 విధిస్తారని స్పష్టమవుతోంది. అయితే అన్‌లాక్ 2.0 లో కొత్తగా వేటికి అనుమతిస్తారనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.
అన్‌లాక్ 1.0, అన్‌లాక్ 2.0కు పెద్దగా పోలిక ఉండకపోవచ్చని తెలుస్తోంది. అన్‌లాక్ 2.0లో కొత్తగా వేటికీ అనుమతించకపోవచ్చని సమాచారం. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో అన్‌లాక్ 2.0 ఇతర ఏ కార్యకలాపాలకూ అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను తెరిచేందుకు జూలైలో అనుమతిస్తారని ముందుగా సమాచారం తెలుస్తున్నా.. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆ నిర్ణయాన్ని ఆగస్టుకు వాయిదా వేసే అవకాశం ఉందని తెలిసింది. ఇక థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం లేనట్లు సమాచారం. కానీ జిమ్‌లు, బార్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక పబ్‌లలో సోషల్ డిస్టాన్స్, మాస్కులను ధరించడం కష్టం కనుక వాటికి కూడా ఇప్పుడప్పుడే అనుమతి లభించకపోవచ్చు. ఇక పోతే రైల్వే శాఖ ఆగస్టు 12 వరకు సాధారణ రైళ్లను నడపబోమని, టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి రుసుమును వాపస్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అందువల్ల జూలై 1 నుంచి ప్రారంభమయ్యే అన్‌లాక్ 2.0లో రైళ్ల గురించి ప్రస్తావన ఉండదని మనకు తెలుస్తుంది. కానీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దృష్ట్యా వాటిపై ఏదైనా కీలక ప్రకటన వస్తే రావచ్చు.
ఇక జూలై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఆ తరువాత వాటిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానిపై అన్‌లాక్ 2.0 ప్రకటనలో సమాచారం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇవే కాకుండా గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఆంక్షలను సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఆధ్యాత్మిక ప్రదేశాలను మళ్లీ ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. అలాగే అన్‌లాక్ 2.0లో ఇంకా ఏమైనా ఓపెన్ కాని ఇతర కార్యకలాపాలకు ఆంక్షల సడలింపులను ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోమ, మంగళవారాల్లో అన్‌లాక్ 2.0పై కేంద్రం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.