అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లంగ్ వెనుకబడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. బ్యాట్స్‌మెన్ తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ వికెట్లను కాపాడుకోలేకపోయారు. దీంతో ఇంగ్లండ్‌పై భారత్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లి (80 పరుగులు నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (64 పరుగులు, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (39 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (32 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్ లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ మలన్ (68 పరుగులు, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్ (52 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు)లు మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 2, హార్దిక్ పాండ్యా, టి.నటరాజన్‌లు చెరొక వికెట్ తీశారు.