ప్రస్తుతం జనాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వల్ల పలుకుబడిన కలిగిన రాజకీయ నేతలే కాదు, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు కూడా.. జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. తాము చేసే వ్యాఖ్యలు, పనుల వల్ల జనాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వారు చాలా జాగ్రత్తగా ఆ ప్రపంచంలో విహరించాల్సి వస్తోంది. అయితే భారతీయులు మాత్రం సోషల్ మీడియాలో తమ అసలు పేర్లకు బదులుగా నకిలీ పేర్లతోనే ఎక్కువగా విహరిస్తున్నారని ఓ సంస్థ చేపట్టిన సర్వేల్లో వెల్లడైంది.
ప్రముఖ గ్లోబల్ సెక్యూరిటీ కంపెనీ కాస్పర్‌స్కై చేపట్టిన సర్వే ప్రకారం.. భారతీయుల్లో ఫేస్‌బుక్ వాడేవారిలో 76 శాతం మంది తమ సొంత ఐడెంటిటీని వాడడం లేదని వెల్లడైంది. అలాగే యూట్యూబ్‌లో 60 శాతం మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 47 శాతం మంది, ట్విట్టర్‌లో 28 శాతం మంది తమ అసలు పేర్లకు బదులుగా వేరే పేర్లతో అకౌంట్లను వాడుతున్నట్లు నిర్దారించారు.
సాధారణంగా ఏదైనా ఒక అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, కామెంట్ చేసినా కొందరి నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే కొందరికి తమ అసలు వివరాలను బయట పెట్టడం ఇష్టం ఉండదు. ఇక ఏ అంశంపైనైనా నిర్భయంగా మాట్లాడాలన్నా, కామెంట్లు, పోస్టులు పెట్టాలన్నా.. సోషల్ మీడియాలో అసలు గుర్తింపును వాడకూడదు. అందువల్లే చాలా మంది నకిలీ గుర్తింపుతో సోషల్ మీడియా అకౌంట్లను వాడుతున్నారని గుర్తించారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. నకిలీ ఐడెంటిటీతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తేనే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.