చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లలో జరిగిన రాళ్ల దాడి ఏపీ రాజకీయాలను వెడెక్కించింది. వైసీపీ, టీడీపీ మధ్య వాడీ వేడీ విమర్శలు, దూషణలకు కారణమైంది. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు.. టీడీపీ నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి లక్ష్యంగా దాడి జరిందని ప్రచారం జరిగింది. కానీ.. రెండు పార్టీల నాయకులకు అసలు సంగతి ఆలస్యంగా తెలిసి ఆశ్చర్యపోయారట. అదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
ఆయన్ని అడ్డుకోవాలన్నది ఒకపార్టీ వ్యూహం. మరోపార్టీ కూడా అదే ఆలోచనతో కాపు కాసింది. టైమ్ చూసుకుని రెండు పార్టీల కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. అయితే వారి లక్ష్యం మాత్రం వేరే ఉంది. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత శంకర్ యాదవ్ లక్ష్యంగా రాళ్ల దాడి జరిందన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఆయనపై ఒక్క టీడీపీ నేతలే కాదు.. వైసీపీ వర్గాలు కూడా కోపంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎప్పడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని రెండువర్గాలు ఎదురు చూస్తున్న క్రమంలోనే అంగళ్ల ఘటన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. రెండు పార్టీలు శంకర్ యాదవ్‌పై ఎందుకు కక్ష కట్టాయన్నది తెలుసుకుని జనం కూడా కథలు కథలుగా చెప్పుకొంటున్నారట.
శంకర్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కమీషన్ల కోసం సొంత పార్టీ వారిని కూడా వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీలోనే ఆయనకు వ్యతిరేక వర్గం ఒకటి తయారైందట. అలాగే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వైసీపీ నేతలు కూడా ఇబ్బంది పడ్డారట. గతంతో అంగళ్లలోనే వైసీపీ వారిని శంకర్ యాదవ్ అడ్డుకున్నారట. దీంతో ఇటు టీడీపీలోని శంకర్ యాదవ్ వ్యతిరేక వర్గం.. తంబళ్లపల్లికి చెందిన వైసీపీవాళ్లు మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు చిక్కుతారా అని కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారట.
తంబళ్లపల్లెలో టీడీపీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంపై జిల్లా టీడీపీలో విస్తృత చర్చ జరిగిందట. శంకర్‌యాదవ్ వస్తే ఆయనపై అటాక్ చేస్తామని వ్యతిరేకవర్గం పార్టీ నేతలకు ముందుగానే చెప్పిందట. శంకర్ యాదవ్‌తో కలిసి రావొద్దని నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి తెలియజేశారట. కానీ.. కిశోర్ కుమార్ కారు వెనక శంకర్ యాదవ్ కూడా మరో కారులో వస్తున్నారని తెలుసుకున్న టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం అంగళ్లలో అడ్డుకుంది. వైసీపీ నేతలు కూడా అక్కడే మోహరించారట. ఈ గుంపులో కొందరు రాళ్లు విసరడంతో అవి టీడీపీ నేతల కార్లపై పడ్డాయి. ఒక్కసారిగా కలకలం రేగింది.
టీడీపీ నేతలపై వైసీపీ దాడి అని ఒకరు.. వైసీపీ వారిపై టీడీపీ నేతల దాడి అని ఇంకొకరు ఆరోపించుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి లక్ష్యంగా దాడి జరిగిందని టీడీపీ ఆరోపిస్తోన్న సమయంలో.. శంకర్ యాదవ్ విషయం మెల్లగా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. టీడీపీలోని ఓవర్గం.. వైసీపీ కార్యకర్తలు ఇద్దరూ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ లక్ష్యంగానే దాడి చేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారట. అసలు విషయం తెలిసినప్పటి నుంచీ ఇదా సంగతి అని నోరెళ్లబెడుతున్నారట రెండు పార్టీల నాయకులు.