బిహార్‌లోని నవాడా జిల్లాలో అమానవీయ చర్య చోటుచేసుకుంది. ఓ భూమి విషయంలో ఘర్షణ నెలకొనగా దళితులు ఉంటున్న కాలనీలోని 21 ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు.ముఫాసిల్ పీఎస్ పరిధిలోని కృష్ణానగర్‌లో బుధవారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ప్రజలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, అనంతరం ఇళ్లకు నిప్పు పెట్టారని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ఇళ్లల్లోని వస్తువులు, పశువులు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో భారీగా బలగాలను మోహరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు భూ వివాదమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడితో సహా 10 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.తప్పించుకున్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.నిర్వాసితులకు ఆహార ప్యాకెట్లు, తాగునీరు సహా సహాయక సామగ్రిని అందిస్తున్నామని, బాధితుల కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశామని నవాడా జిల్లా మేజిస్ట్రేట్ అశుతోష్ కుమార్ వర్మ తెలిపారు.