ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 6వ బిమ్‌స్టెక్ సదస్సులో పాల్గొననున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ ఆ దేశ పీఎం పేటోంగ్ టార్న్ షినవత్రాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నాయకులు విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ విజన్‌లో థాయ్‌లాండ్‌కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. భద్రతా ఏజెన్సీల మధ్య వ్యూహాత్మక చర్చలు మెుదలు పెట్టడం పైనా సమాలోచనలు జరిపామని వెల్లడించారు. సైబర్ క్రైమ్ వలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి భారత్‌కు వెనక్కి పంపింనందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసినట్లు పీఎం పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు పెంపుపైనా చర్చలు జరిపినట్లు చెప్పిన మోదీ.. MSMEలు, చేనేత, హస్తకళల రంగాల్లో సహకారంపై థాయ్‌లాండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.