గత శుక్రవారం అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్, ఇరాన్ రెండో శక్తివంతుడు జనరల్ ఖాసీం సులేమాని అంత్యక్రియలు ముగిసాయి. భారీగా ఆయన అభిమానులు, రెండు మూడు దేశాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనితో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో వీధులు అన్ని కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. ఇరాక్, ఇరాన్ సైనికులు కూడా ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కుమార్తె మాట్లాడుతూ అమెరికాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేసారు. అమెరికాను ఉద్దేశించి మాట్లాడిన ఆమె, తన తండ్రిని చంపిన అమెరికాకు చీకటి రోజులు దాపురించాయని జీనాబ్ సులేమానీ హెచ్చరించారు. ఆమె అక్కడితో ఆగలేదు. అధ్యక్షుడు ట్రంప్ ని ఉద్దేశించి, పిచ్చి ట్రంప్ తన తండ్రి బలిదానంతో అంతా ముగిసిందని అనుకోకు అంటూ హెచ్చరించారు.
ఇరాన్ అధికారిక మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆదేశాలతోనే తాము సులేమానిని హత్య చేసామని అమెరికా సైన్యం పేర్కొంది. ఇక ఇరాన్ తమకు లొంగకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. సులేమాని హత్య తర్వాత అమెరికా ఇరాన్ యుద్ధం వస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయం ప్రపంచ దేశాల్లో నెలకొంది.