ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును చూస్తే.. ఆయన మాటలు వింటే.. ఎంత కరడు గట్టిన వారికైనా అయ్యో అని అని పించక మానదు! ఇక, ఆయన వ్యాఖ్యలు వింటే.. బీసీలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ, దూర దృష్టి ఇంక ఎవరికైనా ఉంటుం దా? అని కూడా అనిపించక మానదు. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన 59.3 శాతం రిజర్వేషన్‌ను హైకోర్టు తోసిపుచ్చి కేవలం 50శాతానికే పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు.. అన్ని వర్గాలకు కలిపి 50 శాతానికే పరిమితం కానున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా బీసీల పై ప్రభావం పడుతుందనేది వాస్తవం.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు బీసీలకు జగన్ అన్యాయం చేస్తున్నాడంటూ రగలిపోయారు. దివంగత వైఎస్ కూడా బీసీ వ్యతి రేకని, నాడు బీసీ కమిషన్ కోరిన డబ్బులు ఇవ్వలేదని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే బీసీ నిధులు రూ.3600 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. బీసీలు ఎక్కువగా ఉండే శాసనమండలిని రద్దు చేస్తామని జగన్ అంటున్నారని, బీసీల చేతిలో ఉన్న అసైన్డ్ భూములను దౌర్జన్యంగా లాగేసుకునే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. అదే సమయంలో బీసీలకు రిజర్వేషన్ తగ్గిపోవడం వల్ల.. 16000 మందికి వివిధ పదవుల రూపంలో అన్యాయం జరుగుతుందని అన్నారు.
అంతేకాదు, కేంద్రం వద్దకు వెళ్లి శాసన మండలిని రద్దు చేయాలని కోరిన జగన్.. ఇప్పుడు బీసీల విషయంలోనూ వెళ్లి సిఫారసు చేయాలని కోరారు. ఇక, ఈ క్రమంలోనే గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాకచక్యం గా వ్యవహరించి పరిష్కరించిందని, కానీ, జగన్ మాత్రం ఆదిశగా చేయకపోతే.. నాశనం అయిపోతాడని కూడా బాబు శపించేశారు..! మరి ఇన్ని చెప్పి.. బీసీల కోసం కన్నీరు పెట్టిన చంద్రబాబు.. తన హయాంలో వారికి ఏం చేశారనే విషయాన్ని మాత్రం బాబు ఎక్కడా మచ్చుకైనా చెప్పలేదు. బీసీ వర్గానికి చెందిన క్షురకులు.. తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరినప్పుడు వారిని ఎలా చీదరించుకున్నారో.. బాబు మరిచిపోయినా.. వారు, ఆ సంఘటనలను చూసిన వారు ఎవరూ కూడా మరిచిపోలేదు.
ఇక, తన హయాంలోనేనిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు నిర్వహించలేక పోయారో బాబు చెప్పనే లేదు. మరి ఇప్పుడు జగన్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడని వగచే బదులు తన హయాంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించి ఇబ్బడి ముబ్బడిగా బీసీలకు న్యాయం చేసి ఉంటే బాగుండేదికదా?! దీనికి కూడా బాబు దగ్గర సమాధానం లేదు. మరో విషయం ఈ కేసు మూడు మాసాల పాటు హైకోర్టులో విచారణ జరిగితే.. ఇంప్లీడ్ అవ్వాలనే ఆలోచన కూడా చేయని బాబు ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయంలో తెగ ఫీలవడన్నా బట్టి నిజంగా మనం ఫీలవ్వాల్సిందే! ఏమంటారు!!