ఏపీ సీఎం జగన్‌కు మళ్లీ వెయిటింగ్ తప్పడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఆయన ఎంతో ఉత్సాహం గా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మ ఒడి, పేదలకు ఇళ్లు వంటి కీలక పథకాలను వడివడిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు., అమ్మ ఒడి సక్సెస్ అయింది. అయితే, పేదలకు ఇళ్లు పథకం దగ్గరకు వచ్చే సరికి కరోనా ఎఫెక్ట్ సహా అనేక చిక్కులు వచ్చాయి. స్థానిక సంస్థలకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక, ప్రచారం కూడా ప్రారంభించాక, మరో వారంలో ఎన్నికలు జరుగుతాయని అనగా.. అవి అనూహ్యంగా ఆరువారాల పాటు వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం కూడా జరిగింది. ఎట్టకేల కు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎన్నికల కమిషనర్‌కు చెక్‌పెట్టింది. దీంతో కొత్తగా మరో కమిషనర్‌ను నియ మించారు. అంటే.. త్వరగానే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నమాట.ఈ వ్యూహం ప్రకారం మే తొలి వారం లేదా రెండో వారంలో తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు సాగాలని నిర్ణయించు కుంది. అయితే, ప్రభుత్వం ఇలా ఆలోచిస్తే.. హైకోర్టు రూపంలో మరో చిక్కు వెంటాడింది. ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు, ప్రబుత్వ కార్యాలకు వైసీపీ జెండా రంగులు వేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఓ సలహాదారు చెప్పిన మేరకు ఆయా రంగులను దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మరీ మార్చారు. అవే ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. స్థానిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రంగులు ఉంటే ప్రజలు ప్రభావిత మవుతారంటూ దాఖలైన పిటిషన్‌లను విచారించిన కోర్టు.. ఆ రంగులను వెంటనే తొలగించాలని కోరింది. అయితే, దీనికి ఓ నెల రోజులు సమయం కావాలని ప్రభుత్వం అభ్యర్ధించింది. ఈ క్రమంలో మూడు వారాల సమయం ఇచ్చిన హైకోర్టు.. రంగులను మార్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటూ షరతు పెట్టింది.
అది కూడా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత వచ్చే మూడు వారాల్లో మార్చాలని షరతు విధించింది. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ ఎప్పుడు తొలగిస్తారు? అనేది ఎవరూ చెప్పలేని సమాధా నం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ ఎత్తివేతకు మరింత సమయం పడుతుందని అంటున్నారు. ఇది ముగిసి, మూడువారాల్లో రంగులు మార్చి, ఈ విషయం కోర్టుకు చెప్పి.. తర్వాత ఎన్నికలకు వెళ్లడం అంటే.. జూన్ రెండో వారానికి జరిగినా జరిగినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ప్రభుత్వం ఆశలపై ఇలా నీళ్లు కుమ్మరించినట్టయింది సలహాదారుల పని అంటున్నారు విశ్లేషకులు.