కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా, తాను అడుగుపెట్టిన ప్రతి భాషలోనూ అగ్రస్థానం పొందిన హీరోయిన్ శ్రీదేవి. అత్యంత విషాదకర పరిస్థితుల్లో శ్రీదేవి కన్నుమూయడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ఆమె మృతిపై ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయి. బాత్ టబ్ లో పడి మరణించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నా, ఇప్పటికీ స్పష్టతలేదు. అయితే, శ్రీదేవి జీవితకథ రాసిన సత్యార్థ్ నాయక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సత్యార్థ్ నాయక్ మాటల ప్రకారం రక్తపోటే ఆమె పాలిట మృత్యుపోటుగా మారింది. ఆమెకు లో బీపీ ఉందట! శ్రీదేవి మరణం గురించి సత్యార్థ్ నాయక్ మాట్లాడుతూ ‘‘శ్రీదేవి లో బీపీతో సతమతమయ్యేవారని ‘చాల్‌బాజ్’ దర్శకుడు పంకజ్ పరాషర్, నాగార్జున నాతో చెప్పారు.
తమతో కలిసి సినిమాలు చేసినప్పుడు ఆమె బాత్‌రూమ్‌లో పడ్డారని వారు గుర్తు చేసుకున్నారు. తర్వాత నేను శ్రీదేవి చెల్లెలు మహేశ్వరిని కలిశా. ఆమె కూడా శ్రీదేవి ఓసారి బాత్‌రూమ్‌లో పడి ఉండడం చూశానని చెప్పారు. ఒకసారి వాకింగ్ చేస్తుండగా శ్రీదేవి కుప్పకూలిపోయారని బోనీ కపూర్ నాతో చెప్పారు. నేను రాసినట్టు ఆమె రక్తపోటు వల్లే మరణించారు’’ అన్నారు.