కీల‌క స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున సాయం ఏదీ…వారంతా ఏమైన‌ట్టు…!

-

తూర్పు గోదావ‌రి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఇక్క‌డ అనేక మంది నాయ‌కులు కొన్ని ద‌శాబ్దాలుగా జెండా మోస్తున్నారు. మ‌రికొంద‌రు ఇటీవ‌ల కాలంలో పార్టీలో చేరి మంచి మంచి ప‌ద‌వులు ఒడిసి ప‌ట్టుకున్నారు. అయితే, పార్టీ అధినేత చంద్ర‌బాబుకు వీర విధేయుల‌మ‌ని చెప్పుకొనే వీరంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు ?  క‌రోనా క‌ల్లోలం స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ఎంత మంది ముందుకు వ‌స్తున్నారు ? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఒక‌వైపు చంద్ర‌బాబు హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మయ్యారు. మ‌రోవైపు త‌మ్ముళ్లు కూడా ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో అస‌లు జిల్లాలో నాయ‌కులు ఉన్నారా?  లేరా ? అనే సందేహం వ‌స్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో మేం ఓడినా.. గెలిచినా.. మీవెంటే అని ప్ర‌చారం చేసిన నాయ‌కులు ఇప్పుడు క‌నిపించ‌క‌పోవ‌డంపై ప్ర‌జ‌ల్లోనూ ఒక‌విధ‌మైన గంద‌ర‌గోళం నెల‌కొంది.

విష‌యంలోకి వెళ్తే.. టీడీపీలో నంబర్‌–2గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు అమరావతికే పరిమితమయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన యనమల, ఆయ‌న బ్ర‌ద‌ర్ కృష్ణుడు కరోనా మహమ్మారి కమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో  ప్రజలు ఎలా ఉన్నారనే వాకబు కూడా చేయలేదని అంటున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చక్రం తిప్పిన నిమ్మకాయల చినరాజప్ప కరోనా భయంతో ఉన్న ప్రజలకు ధైర్యం కల్పించడంలో నామ్‌కే వాస్తే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. స్థానికేతరుడని కూడా చూడకుండా పెద్దాపురం ప్రజలు రెండోసారి ఆయనను ఎమ్మెల్యేను చేశారు.

ప్రస్తుత ఆపత్కాలంలో రాజప్ప తమకు భరోసా అందిస్తారని ఆ నియోజకవర్గ వాసులు ఎదురు చూశారు. తీరా ఏదో ఒకటీ అరా అదీ కూడా పార్టీ కార్యకర్తల కార్యక్రమాల్లోనో.. అధికారులతో మొక్కుబడి సమీక్షల్లోనో ఫొటోలకు పోజులిచ్చి చేతులు దులిపే సుకున్నారని పెద్దాపురం ప్రజలు ఆక్షేపిస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ ప్రజలు ఆదిరెడ్డి భవానీని ఎమ్మెల్యేగా ఎన్నుకు న్నారు. ఆమె కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నగర ప్రజలను కనీసంగా కూడా కలుసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. భవానీ చారిటబుల్‌ ట్రస్టు పేరుతో చేసిన ఒకటీ అరా సేవా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్‌గా పని చేసిన ఆమె అత్త వీరరాఘవమ్మ, మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల్లో ఏ ఒక్కరూ కనిపించలేదు.

రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధవళేశ్వరం ఇండస్ట్రియల్‌ కాలనీలో 100 మంది కార్మికులకు బియ్యం, మాస్క్‌లు ఇచ్చి ఊరుకున్నారు. ఆ తరువాత పత్తా లేకుండా పోయారని ఆ నియోజకవర్గ ప్రజలు విమ‌ర్శిస్తున్నారు.  రెండుసార్లు గెలిపించినందుకు ఆయన తమకు చేసే మేలు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మండపేట లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వేగుళ్ల జోగేశ్వరరావు కూడా ఇదే దారిలో ఉన్నారు.  మండపేట మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి మాసు్కలు, శానిటైజర్లు అందజేశారు.

అంతే.. ఆ తరువాత ఆయన అడ్రస్‌ లేరని పలువురు ఆక్షేపిస్తున్నారు.  టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌వీఎస్‌ వర్మ(పిఠాపురం), దాట్ల బుచ్చిబాబు(ముమ్మిడివరం) తదితరులు ప్రజలను కనీసంగా కూడా పలకరించడం లేదు. ఇక‌, వైసీపీ నుంచి అప్ప‌ట్లో టీడీపీ సైకిల్ ఎక్కిన జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట) కొద్దోగొప్పో కార్యక్రమాలు చేస్తున్నా, గొల్లపల్లి సూర్యారావు(రాజోలు), బండారు సత్యానందరావు(కొత్తపేట), వనమాడి కొండబాబు(కాకినాడ సిటీ).. ఇలా దాదాపు మాజీలంతా ప్రజలతో పని లేదన్నట్టుగా ఉండ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version