వైసీపీ నేతల వర్గపోరు అక్కడ పేదల కడుపు కొట్టేలా ఉందే

-

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మరోసారి అధికారపార్టీ నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య వివాదం ఎఫెక్ట్ ఈసారి ప్రభుత్వ పథకం పై పడింది.చౌక డిపోల నుంచి ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే వాహనాల పంపిణీ ఇద్దరి విభేదాలతో నియోజకవర్గంలో నిలిచిపోయిందట. ఇద్దరు నేతలు ఈగోలకు పోవడంతో పేదల కడుపునింపే బియ్యం పంపిణీ నియోజకవర్గంలో అటకెక్కింది.

నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్, పార్టీ ఇంచార్జి బైరెడ్డి సిధార్థ రెడ్డి నామాట చెల్లుబాటు కావాలంటే నామాట చెల్లుబాటు కావాలంటూ వీధికెక్కుతున్నారు. ఎమ్మెల్యే అయినా తనకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా సిధార్థ రెడ్డి తనపై పెత్తనం చేస్తున్నారంటూ ఆర్థర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరో వైపు తన ఎదుగుదల చూసి ఓర్వలేక తనపై అబాండాలు వేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాదిస్తున్నారు. చివరికి వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం పంచాయతీ అధికారులకు తలనొప్పిగా మారిందట.

రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో చౌక డిపోల నుంచి ఇంటింటికి బియ్యం పంపిణీ చేసేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. లోన్ సమకూర్చి వాహనం ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందేందుకు నెలలో కొన్ని రోజులు చౌక డిపోల నుంచి బియ్యం ఇంటింటికి పంపిణీ చేసే బాధ్యత వారికి అప్పగిస్తుంది. ఆ విధంగా నందికొట్కూరు నియెజకవర్గం లోని వివిధ మండలాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు 61వాహనాలు కేటాయించారు. ఈ వాహనాల లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య వివాదానికి దారితీసింది.

నందికొట్కూరు మున్సిపాలిటీకి 9,నందికొట్కూరు రూరల్ 9,మిడ్తూర్ మండలం 9,పగిడ్యాల మండలం 7, జూపాడుబంగ్లా మండలం 9, పాములపాడు మండలం 9, కొత్తపల్లి మండలం 9 కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. అయితే పాములపాడు మినహా మిగిలిన అన్ని మండలాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సూచించిన జాబితా ఎంపిక చేయాలని జిల్లా అధికారులపై ఒత్తిడి వచ్చిందట. దీంతో రేషన్ బియ్యం పంపిణీ వాహనాల లబ్ధిదారుల ఎంపిక పై అధికారుల నిర్ణయం ఎమ్మెల్యే ఆర్థర్ కి ఆగ్రాహానికి గురిచేసింది.

పార్టీ జిల్లా ఇంచార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి వాహనాల లబ్ధిదారుల ఎంపిక పై ఫైరయ్యాడట ఎమ్మెల్యే ఆర్ధర్. ఎమ్మెల్యేగా తాను ఉంటే ఒక్క మండలం మినహా ఇంచార్జి సిధార్థ రెడ్డి అన్ని మండలాల్లో లబ్ధిదారుల జాబితా ఇవ్వడమెంటని ఆవేదన వ్యక్తం చేశారట. ఇప్పటికే ఇంటర్యుల ద్వారా ఎంపిక చేసిన జాబితా పక్కకు పెట్టి ఇంచార్జి ఇచ్చిన జాబితా ఎంపిక చేస్తే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జడ్పీ సీఈఓ కు ఫోన్ చేసి చెప్పారట. పార్టీ జిల్లా ఇంచార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఈ వివాదంపై ఆరా తీసారట.దీంతో నియోజకవర్గంలో వాహనాల పంపిణీ నిలిపేశారు అధికారులు.ఈ వివాదంలో ఇంచార్జి బైరెడ్డి మాట నెగ్గుతుందో..ఎమ్మెల్యే అర్థ ర్ ది పైచేయి అవుతుందో వేచి చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version