దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలకు, ప్రత్యేక పరిస్థితుల్లో నడిచే విమానాలకు వర్తించవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది.
అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు కొనసాగించింది. త్వరలో అంతర్జాతీయ విమానాలు కూడా ప్రారంభమవుతాయని వార్తలు వెలువడుతున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. దేశీయ విమాన సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సాధారణ ప్రయాణికుల రైళ్ల సర్వీసులను ఆగస్టు 12 వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే.