రెండేళ్ల తాలిబన్ల పాలనలో.. 200 మంది మాజీ ప్రభుత్వాధికారుల హత్య

-

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని ఇటీవలే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్లలో తాలిబన్లు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రెండేళ్ల పాలనలో దాదాపు 200కుపైగా మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది తాలిబన్ల చేతిలో హతమయ్యారు. ఈ విషయాన్ని ఐరాస (UN) తన నివేదికలో వెల్లడించింది. సైన్యం, పోలీసు, ఇంటెలిజెన్స్‌ వర్గాలను ఎక్కువగా లక్ష్యం చేసుకున్నట్లు అఫ్గానిస్థాన్‌లో UN సహాయ మిషన్‌ (UNAMA) తెలిపింది.

2021 ఆగస్టు 15నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు.. అఫ్గాన్‌ మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతా బలగాల విషయంలో 800కుపైగా హక్కుల ఉల్లంఘనల కేసులను యూఎన్‌ఏఎంఏ నమోదు చేసింది. విచారణ లేకుండా హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధం, చిత్రహింసలు వంటి వాటిని ఇందులో పేర్కొంది. తాలిబన్లు చుట్టుముట్టడంతో అప్పటి దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, విదేశాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ‘ఇక అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాజీ ప్రభుత్వ అధికారులు, భద్రతాబలగాలపై విరుచుకుపడ్డారు. 424కుపైగా ఏకపక్ష అరెస్టులు, 144కుపైగా చిత్రహింసలు, దాదాపు 14 అదృశ్య ఘటనలు ఇందులో ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version