భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతీ ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ఉద్ఘాటించారు. సమయం వృథా చేయకుండా కూర్చొని మాట్లాడుకుని.. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌లకు ఆయన పిలుపునిచ్చారు.
మరో వైపు ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికాలోని శ్వేత సౌధం స్పందించింది. మోదీ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. మోదీ పర్యటనతో రష్యా, ఉక్రెయిన్ సంఘర్షణ ముగిస్తే.. అది బాగా ఉపయోకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.