అమెరికాకు వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులకు అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. వివిధ వర్సిటీల్లోని కోర్సుల్లో చేరేందుకు వెళ్లిన వారిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు గురువారం రోజున అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రిటర్న్ ఫ్లైట్‌లు ఎక్కించారు. వివిధ పత్రాలు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలను చూపారు.
అయితే ఇలా వెనక్కి పంపించిన వారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. విమానాశ్రయాలకు చేరుకున్నాక సాధారణ తనిఖీల్లో భాగంగా కొంతమందిపై అనుమానంతో అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఆరా తీశారు. ప్రవేశాలు దక్కిన వర్సిటీలో ఫీజులు, విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలు, అమెరికాలోని విద్యార్థులతో సంభాషణలను లోతుగా పరిశీలించిన అధికారులు వారిని తిప్పి పంపినట్లు తెలుస్తోంది.
ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్ అయిన విద్యార్థులు తిరిగి 5 ఏళ్ల దాకా ఆ దేశ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు. తమ పిల్లలను తిరిగి పంపించడంపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.