అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను విలయం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో కురుస్తున్న కుంభవృష్టితో జనజీవనం స్తంభించింది. మరోవైపు కొన్ని ప్రదేశాల్లో మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలమైన గాలులతో పాటు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని స్థానిక అధికారులు తెలిపారు. మొత్తం 130చోట్ల నుంచి వరదలు ముంచెత్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో రాష్ట్ర గవర్నర్ ఎమర్జెన్సీని విధించారు.
రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న పర్వత ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. మట్టి పెళ్లలు విరిగిపడటంతో బెల్ ఎయిర్, బెవర్లీ హిల్స్ వద్ద భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. లాస్ ఏంజిలెస్ ప్రాంతంలో గత 150 ఏళ్లలో నమోదైన తొలి ఐదు అత్యధిక వర్షపాతాల్లో ఇది ఒకటని మేయర్ తెలిపారు. మరోవైపు శాన్‌ఫ్రాన్సిస్కోలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిన ఘటనల్లో ముగ్గరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.