అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని అలలు వణికిస్తున్నాయి. తీరప్రాంతంలో రాకాసి అలలు ఎగసిపడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజులుగా తీరానికి సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతుండటంతో చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. అలల ధాటికి పలువురు గాయపడ్డారు. సుమారు 20-40 అడుగుల ఎత్తులో అలలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
వెంచురాలో సముద్రపు అలలు దాదాపు 10 మందిని ఈడ్చుకువెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు వారిని కాపాడారు. అలల తాకిడి కారణంగా ఎనిమిది మంది ఆస్పత్రి పాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు భారీ అలల ప్రభావంతో కాలిఫోర్నియాలోని చాలా తీర ప్రాంతాలను మూసివేశారు.
ముఖ్యంగా వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి అలలు ఎగసిపడుతుండటంతో రోడ్లపై నిలిపి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయి. ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. హెర్మోస, మాన్‌హట్టన్, పాలోస్ వెర్డోస్ బీచ్‌ల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాలిఫోర్నియా, ఓరెగాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ ఆలల ప్రభావానికి గురవుతున్నారు.