ఇండియాను భారత్‌గా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే పేరు మార్పుపై ప్రపంచ దేశాలు కూడా స్పందిస్తున్నాయి. తాజాగా చైనా ఈ వ్యవహారంపై స్పందించి.. మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టింది. జీ20 సమావేశాలు సమీపిస్తున్న వేళ.. భారత్ పేరు మార్పు విషయం ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.
అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందుకు జీ20 వేదికను అవకాశంగా మార్చుకోవాలని భారత్ కోరుకుంటోందని పేర్కొంటూ చైనా తన అక్కసు వెళ్లగక్కింది. పేరు కంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలని చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తాజా కథనంలో వెల్లడించింది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను భారత్ సంస్కరణల మార్గంలో నడిపించగలదా అన్నదే ముఖ్య విషయని చైనా వ్యాఖ్యానించింది. ‘జీ20 సదస్సులో ప్రపంచానికి దిల్లీ ఏం చెప్పాలనుకుంటోంది..? కేవలం వలసవాదంగా భావిస్తున్న పేరును తొలగించే ప్రయత్నంగా కనిపిస్తోంది’ అని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.