గత నాలుగేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో తెలిసిందే. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది రోడ్డున పడ్డారు. రెండేళ్ల తర్వాత నెమ్మదిగా కరోనా ప్రభావం తగ్గిపోయింది. అయినా ఇప్పటికీ కరోనా దెబ్బకు మనుషులే కాదు చాలా దేశాలు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాయి. ఇప్పుడు మరోసారి ఈ మహమ్మారి మళ్లీ అలజడి సృష్టిస్తోంది.
కరోనా మహమ్మారి సింగపూర్‌లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని కోరారు. కొత్తగా కొవిడ్ ఉద్ధృతి మొదలవుతోందని, అది క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాల్లో అది గరిష్ఠ స్థాయికి చేరవచ్చని తెలిపారు. నిత్యం దాదాపు 250 మంది కొవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారన్న ఆంగ్.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. రోగులకు పడకలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. అత్యవసరంకాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని సూచించారు.