కరోనా, నిఫా, ఎబోలా.. ఇలా ఇప్పటికే పలు రకాల వైరస్‌లతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే .. త్వరలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచాన్ని గడగడలాడించడానికి మోర మహమ్మారి రానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ కరోనా మహమ్మారి తరహాలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని.. కరోనా మహమ్మారి కంటే డిసీజ్ ఎక్స్ ప్రజలపై 7 రెట్ల అధిక ప్రభావం చూపిస్తుందని.. బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ హెడ్ డేమ్ కేట్ బింగ్‌హామ్ చెప్పారని డైలీ మెయిల్ ఒక కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని.. వాటన్నింటినీ మానవాళికి ముప్పుగా భావించలేమని డేమ్ కేట్ పేర్కొన్నారు. కానీ వాటిలో కొన్ని మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని తెలిపారు. కరోనా మహమ్మారి సోకిన వారిలో ఎక్కువ మంది వైరస్ బారి నుంచి బయటపడగలిగారు కానీ డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిపై ప్రభావం చూపిస్తుంది అని డేమ్ కేట్ అభిప్రాయపడ్డారు. డిసీజ్ ఎక్స్‌ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.