తనకు జైలు శిక్ష విధిస్తే అగ్రరాజ్యంలో రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు జరగవొచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని తెలిపారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని.. అలాగే తనని అభిమానించేవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని .. తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని పరోక్షంగా సంకేతమిచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్‌నకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శృంగార తార స్టార్మీ డానియల్స్‌కు డబ్బు చెల్లింపు, దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖరారు చేయనుంది.