బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారన్న కేసులో.. విచారణ జరుపుతున్న న్యాయమూర్తిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు హాల్‌లోనే మండిపడ్డారు. తనపై కేసు వేసిన న్యాయవాదిపై కూడా ట్రంప్ నిప్పులు చెరిగారు. న్యాయమూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉపన్యాస ధోరణిలో సమాధానాలు ఇవ్వడం తగదనీ అడిగిన వాటికి మాత్రమే నేరుగా జవాబివ్వాలని న్యూయార్క్ అటార్నీ జనరల్.. ఆర్థర్ ఎన్గోరాన్ చాలా సార్లు ట్రంప్‌నకు సూచించారు.
అయినా ట్రంప్ పట్టించుకోలేదు. కావాలనే పదేపదే ఉపన్యాస ధోరణిలో వ్యంగ్యంగా జవాబులు ఇచ్చారు. తన సంస్థల ఆస్తుల విలువను అధికంగా చూపి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారన్నది ట్రంప్‌పై ప్రధాన ఆరోపణ. వివరణ ఇచ్చే క్రమంలో కోర్టు హాలును ట్రంప్.. రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా తనపై వరుస కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సంక్షిప్త సమాధానాలు ఇవ్వాలన్న జడ్జి ఆర్థర్ ఎన్గోరాన్ చెప్పినా పదే పదే ఉల్లంఘిస్తూ, ఉపన్యాస ధోరణిలో, వ్యంగ్యంగా వాంగ్మూలం ఇచ్చారు ట్రంప్.