కమలా హారిస్‌ను ఓడించడం ఇంకా సులభం: ట్రంప్‌

-

కమలా హారిస్‌ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. డెమోక్రటిక్‌ నామినీగా బైడెన్‌ వైదొలిగిన అనంతరం ట్రంప్ స్పందిస్తూ.. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్‌ అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగిన వ్యక్తి కాదని అన్నారు. ఆ హోదాలో పనిచేసే అర్హత ఆయనకు ఏనాడూ లేదని తెలిపారు.

మీడియా, వైద్యులు సహా చుట్టూ ఉన్న అందరికీ ఆయన అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన పాలన వల్ల మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామని.. వాటిని వీలైనంత త్వరగా చక్కబెడదామంటూ ట్రంప్ పేర్కొన్నారు.

డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు బైడెన్‌ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఆమెపై ట్రంప్ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ.. బైడెన్‌ కంటే కూడా ఆమె మరింత తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తి అని విమర్శించారు. ఆమెకు అప్పగించిన సరిహద్దు సమస్యకు ఏమాత్రం పరిష్కారం చూపలేకపోయారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version