రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ రక్షణ అవసరాలు తీరుస్తామని, అవసరమైన ఆయుధాలందిస్తామని నాటోలోని జీ-7 దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్‌తో జీ-7 దేశాలు (అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్) విడివిడిగా ఒప్పందాలు చేసుకోనున్నాయి. దీంతోపాటు నాటో-ఉక్రెయిన్ కౌన్సిల్‌నూ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్-నాటో కౌన్సిల్‌లో భాగంగా 31 నాటో దేశాలు ఉక్రెయిన్‌తో విడివిడిగా అవసరమైనప్పుడల్లా సమావేశమవుతాయి. లిథువేనియాలో జరిగిన రెండు రోజుల నాటో కూటమి శిఖరాగ్ర భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆ దేశాన్ని బలోపేతం చేస్తామని నాటో దేశాలు వెల్లడించాయి.
‘మా దేశానికి, మా ప్రజలకు, పిల్లలకు, వారి భవితకు సంతోషకరమైన వార్తతో వెళుతున్నా. నాటోలో సభ్యత్వానికి ఇది పునాది వేస్తుందని ఆశిస్తున్నా. నాటో మాకెంత అవసరమో, నాటోకు మేమూ అంతే అవసరం’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మేం సమానులుగా భేటీ అయ్యాం. త్వరలోనే మిత్రులుగా (నాటో సభ్యులుగా) కలుస్తామని ఆశిస్తున్నా’ అని నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు.