ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. ‘రైసీ చేతులు రక్తంతో తడిశాయి’ అని అగ్రరాజ్యం వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అనేక అణచివేతల్లో ఆయన హస్తం ఉందన, పరోక్షంగా అనేక హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు పేర్కొంది.
‘‘ఇబ్రహీం రైసీ వ్యక్తి చేతులు రక్తంతో తడిశాయి. ఇరాన్‌లో హక్కుల అణచివేతలో ఆయన పాత్ర ఉంది. హమాస్ సహా అనేక తీవ్రవాద సంస్థలకు మద్దతుగా నిలిచారు. సాధారణంగా ఎవరు మరణించినా మేం విచారం వ్యక్తం చేస్తాం. అలాగే ఆయన మృతి పట్ల కూడా సంతాపం తెలియజేస్తున్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.
రైసీ న్యాయవ్యవస్థలో పనిచేసిన సమయంలో అనేక మంది రాజకీయ ఖైదీలకు మరణశిక్షలు అమలు చేయించారనే ఆరోపణలు ఉండగా.. అధ్యక్ష హోదాలో ఉండగా.. హక్కుల కోసం పోరాడిన మహిళలపై కర్కష వైఖరి అవలంబించారని చెబుతుంటారు. మరోవైపు రైసీ మృతిపై అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా సంతాపం ప్రకటిస్తూ.. ప్రాథమిక, మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఇరాన్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని పేర్కొంది.