ప్రజలు తనపై ఉంచిన అపారమైన విశ్వాసమే తనవద్ద ఉన్న ఏకైక సంపద అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాను కార్యసాధకుడినని.. ఎవరు ఎక్కడ ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. బ్రాండ్ మోదీ అనేది తన రెండు దశాబ్దాల ప్రజా జీవితంపై ప్రజల నమ్మకం అని తెలిపారు. తాను ఏదో చేయడానికే పుట్టానన్న మోదీ.. తన జీవితం కొంత భిన్నమని దేశం అర్థం చేసుకుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఒడిశాలో పర్యటించిన ప్రధాని పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘నేనూ ఒక మనిషినే. తప్పులు జరిగి ఉండొచ్చు. కానీ నేను ఏదీ దురుద్దేశంతో చేయలేదు. దేశానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో ఏ ఒక్క ప్రయత్నాన్నీ నేను విడిచిపెట్టను. తు.చ.తప్పకుండా త్రికరణ శుద్ధితో నేటికీ నా పని నేను చేసుకుని వెళ్తున్నాను. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టడానికి ఏది అవసరమైతే అది చేస్తా. తమ జీవితాలను మెరుగుపరచడానికి చిత్తశుద్ధితో, అవిశ్రాంతంగా కష్టపడి పనిచేస్తానని, అలసత్వాన్ని దరిచేరనివ్వనని ప్రజలు నమ్మారు. ప్రజాశీర్వాదం నాకెంతో బలం. అదే నన్ను నడిపిస్తోంది.’ అని చెప్పారు.